- అమెరికాలోని సియాటిల్ ఎయిర్పోర్టులో కలకలం
- ఇద్దరు మెక్సికన్లను అరెస్టు చేసిన ఇమిగ్రేషన్ ఆఫీసర్లు
వాషింగ్టన్: అమెరికాలోని సియాటిల్–టకోమా ఎయిర్పోర్టులో అధికారులు ఇద్దరు ప్రయాణికులను బలవంతంగా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ముసుగులు ధరించిన ఇద్దరు ఇమిగ్రేషన్ ఆఫీసర్లు విమానం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు ప్యాసింజర్స్ను జెట్ బ్రిడ్జిపై అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏర్పడిన ఉద్రిక్తత, ఇద్దరిలో ఓ మహిళ అధికారుల కాళ్లు పట్టుకుని ‘మాకు వర్క్ పర్మిట్ ఉంది. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు’ అంటూ వేడుకుంటున్న వీడియోలు వైరల్గా మారాయి. ఒక వ్యక్తిని కిందపడేసి అదుపులోకి తీసుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం అలాస్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్లో బోర్డింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది.
వీసా గడువు దాటినందుకే అరెస్ట్
మెక్సికోకు చెందిన రికార్డో లరొండో మెండోజా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉంటున్నాడని సమాచారం అందిందని, దీంతో తనిఖీలు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. మరో మహిళ సోఫియా హెర్నాండెజ్ మెజియా అధికారులపై వేడి కాఫీ విసిరినట్లు తెలిపారు. ఆమె కూడా మెక్సికో సిటిజన్ అని, ఆమె వీసా గడువు కూడా దాటినందున అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
